© 2026 nimisham.in

సాధారణంగా గ్రామాలు అంటే వాటి చుట్టూ కొండలు, కోనలూ, పంట పొలాలు, చెరువులు, పచ్చని చెట్లు, అడవులు ఉంటాయి. కానీ చుట్టూ కనుచూపు మేరా ఎటు చూసినా నీళ్లు.. మధ్యలో తేలియాడుతున్నట్లుగా ఓ గ్రామం..
ఇలాంటి అబ్బురపరిచే గ్రామం ఎక్కడ ఉందో తెలుసా..? అలాగే ఇక్కడి రోడ్డుపై ప్రయాణం న భూతో న భవిష్యతి అన్నట్లుగా సాగుతుంది. చుట్టూ ఎటు చూసినా నీళ్లు.. మధ్యలో తేలుతున్నట్లుగా రోడ్డు చూసేందుకు రెండు కళ్లు చాలవు.. అన్నట్లుగా ఉంటుంది.ఈ ప్రదేశం కేరళలో ఉంది. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తుంటారు. కేరళలోని అలప్పుజ జిల్లా, వెలియనాడ్, కుట్టినాడ్ ప్రాంతంలో ఈ గ్రామం ఉంది. ప్రశాంతమైన నీటి అలలపై పడవలు, మధ్యమధ్యలో ఉన్న రోడ్లపై వాహనాలు వెళ్తుంటే ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోంది. అదే కదమ్ కుడి గ్రామం. అయితే ఇది ఓ చిన్నపాటి దీవి. భూమి, పంట పొలాలను విడదీస్తూ పారుతున్న కాలువలు, నీటిపై కట్టినట్లుగా ఉన్న రోడ్లు చూస్తుంటే ఈ ప్రాంతం భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది. అయితే ఇది నిజంగా నీటిపై తేలియాడే రోడ్లు కాదు. అలా అనుకుంటే పొరపాటు పడినట్లే.. పచ్చని వరి పొలాలు, కాలువల మధ్య ఇరుకైన తారు రోడ్లు, వర్షపు నీటితో నిండిపోవడం వల్ల ఇక్కడి రోడ్లు ఇలా కనిపిస్తుంటాయి.ఇక సోషల్ మీడియాలో ఈ ప్రాంతాన్ని రోడ్ టూ హెవెన్ ఆఫ్ కేరళ అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతానికి చేరుకోవాలని చాలా మందికి ఉంటుంది. కేరళ వచ్చిన టూరిస్టులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలని అనుకుంటూ ఉంటారు. అయితే కదమ్‌ కుడికి రోడ్డు, జల మార్గాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలో అయితే పబ్లిక్ ట్రాన్స్‌ పోర్టుతో పాటు సొంత వాహనాలను తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కారులో ఇక్కడకు చేరుకోవాలంటే ఎడప్పల్లి లేదా కొచ్చి నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. ఎన్ హెచ్ 66 పై నార్త్ పరావుర్ వైపునకు వెళ్లాలి. వరపుజ బ్రిడ్జిని దాటిన తర్వాత కదమ్ కుడి వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. అలా నేరుగా గ్రామానికి చేరుకోవచ్చు. ఇక కేరళలో మరికొన్ని వాటర్ విలేజెస్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి అలప్పూజ లేదా అలెప్పీ. ఇక్కడ పర్యాటకులు హౌజ్‌ బోట్ రైడ్లను ఎంజాయ్ చేయొచ్చు.