© 2026 nimisham.in

ఎంతసేపూ చదువులు, మార్కులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారే కానీ.. వాళ్ల భావోద్వేగాల్ని చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇది వారిలో ఒక రకమైన భయాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది.
దీనివల్ల తల్లిదండ్రులు-పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ లోపించి.. తమకున్న సమస్యల్ని, ఇబ్బందుల్నీ పేరెంట్స్‌తో పంచుకోలేకపోతారు.
ఎంతసేపూ చదువులు, మార్కులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారే కానీ.. వాళ్ల భావోద్వేగాల్ని చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇది వారిలో ఒక రకమైన భయాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు-పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ లోపించి.. తమకున్న సమస్యల్ని, ఇబ్బందుల్నీ పేరెంట్స్‌తో పంచుకోలేకపోతారు. ఇది పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లల మార్కులు, ఆటల్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా.. వారికి తామున్నామన్న భరోసా కల్పించడం, ఎమోషనల్‌గా దగ్గరవడం ముఖ్యమంటున్నారు. దీన్నే ‘ఎలిఫెంట్ పేరెంటింగ్’ అంటారు. మరి, దీనివల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..
⚛ ఏనుగుల్ని పరిశీలిస్తే.. అవి వాటి పిల్లల్ని ఎంతో ముద్దు చేస్తాయి. ఎప్పుడూ వాటికి దగ్గరగా ఉంటూనే వాటిని సంరక్షిస్తుంటాయి. ఇలా పిల్లల్ని మన రక్షణ వలయంలో ఉంచుకోవడం వల్ల వారిలో ఒక రకమైన ధైర్యం అలవడుతుంది. దీనివల్ల జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారంటున్నారు నిపుణులు.
⚛ గున్న ఏనుగు తన తల్లితోనే కాదు.. ఇతర ఏనుగులతోనూ ప్రేమగా ఉంటుంది. ఇందుకు ఆ పిల్ల ఏనుగు తల్లే కారణం. ఎందుకంటే తల్లి ఏనుగు చిన్న వయసు నుంచే తన పిల్లల్ని ఇతర ఏనుగులతో కలిసిపోయేలా ప్రోత్సహిస్తుందట! ఇలా మనమూ మన పిల్లలకు.. మన బంధువులు, స్నేహితులతో కలుపుగోలుగా ఉండడం నేర్పితే.. వారిలో సామాజిక నైపుణ్యాలు అలవడతాయంటున్నారు నిపుణులు. దీనివల్ల అనుబంధాల విలువ తెలుసుకోవడంతో పాటు నలుగురిలోనూ దూసుకుపోయే శక్తి లభిస్తుందంటున్నారు.
⚛ ఏనుగులు తమ తోటి జంతువులు చేసే పనుల్ని సునిశితంగా పరిశీలిస్తాయట. ఈ క్రమంలోనే పిల్ల ఏనుగులు చాలా విషయాలు నేర్చుకుంటాయట! కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటి అలవాటును అలవర్చాలంటున్నారు నిపుణులు. ఎప్పుడూ మొబైల్స్‌తో గడపడం కాకుండా.. పుస్తకాలు చదవడం, ఇతర మంచి పనుల్ని తాము చేస్తూ.. పిల్లలూ చేసేలా ప్రోత్సహించాలంటున్నారు. ఫలితంగా పిల్లలకు మంచి నడవడిక అలవడుతుంది.
⚛ ఏనుగులు ఎంత ఓపిగ్గా, ప్రశాంతంగా ఉంటాయో మనం చూస్తుంటాం. తల్లి ఏనుగులోని ఈ లక్షణాల్నే పిల్ల ఏనుగులూ పుణికిపుచ్చుకుంటాయి. ఇదేవిధంగా పేరెంట్స్ కూడా ప్రశాంతంగా ఉంటూ, పిల్లలు చెప్పేది ఓపిగ్గా వింటూ.. వారి సమస్యలు తీర్చాలి. అప్పుడే వాళ్లూ ఏదీ దాచుకోకుండా పంచుకోగలుగుతారు. ఈ పారదర్శకత పేరెంట్స్‌కి-పిల్లలకు మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. అలాగే ఓపిక, ప్రశాంతత.. పిల్లలూ భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకునేందుకు సహకరిస్తాయి.
⚛ ఏదైనా జంతువు ఒక్క ఏనుగు మీద దాడి చేస్తే.. అన్ని ఏనుగులు గుమిగూడి ప్రతిదాడి చేయడం కొన్ని వీడియోల్లో చూస్తుంటాం. ఇలా కుటుంబంలోనూ అందరూ సమష్టిగా ఉండడం వల్ల ఎలాంటి ఆపదనైనా కలిసికట్టుగా ఎదుర్కోవచ్చని పిల్లలకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లల ముందు భార్యాభర్తలిద్దరూ కీచులాడుకోవడం కాకుండా.. స్నేహితుల్లా మెలగాలి. దీనివల్ల వారూ పెద్దయ్యాక వారి భాగస్వామితో ప్రేమగా ఉండగలుగుతారు.
అయితే ఏనుగుల్ని చూసి నేర్చుకోమన్నారు కదా అని.. ఎప్పుడూ పిల్లల వెంటే ఉంటూ వారిని అతి గారాబం చేయడం, ప్రతి విషయంలో వారిని అదుపు చేస్తూ వారి స్వేచ్ఛను హరించడం, ఆసక్తి ఉన్న అంశాల్లో ప్రోత్సహించకపోవడం.. వంటి పొరపాట్లు అస్సలు చేయకూడదంటున్నారు నిపుణులు. దీనివల్ల వాళ్లు మరీ సున్నిత మనస్కులుగా తయారయ్యే అవకాశాలూ ఉన్నాయంటున్నారు. కాబట్టి మనం నేర్పే ఏ విషయమైనా వారిలో అభద్రతను తొలగించి.. ధైర్యంగా ముందుకు సాగేలా ఉండాలంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.