© 2026 nimisham.in
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా..
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా నిర్మాతలు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు.ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమవడంతో శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన ఇప్పట్లో 'డ్రాగన్' సెట్స్ లో అడుగుపెడతారో లేదో అనే సందేహాలు వచ్చాయి. అయితే మరో రెండు వారాల్లో 'డ్రాగన్' షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని మైత్రీ నిర్మాత రవి శంకర్ చెబుతున్నారు. 'ఇరుముడి' లేటెస్ట్ ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడారు. ప్లాన్ చేసిన్నట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తామని, ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాని రిలీజ్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.రెండు వారాల తర్వాత 'డ్రాగన్' షూటింగ్ బిగిన్ అవుతుంది. కంటిన్యూస్ గా షూట్ చేసి, ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తాం. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగానే వచ్చే ఏడాది జూన్ లో బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది'' అని రవి శంకర్ పేర్కొన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే షెడ్యూల్ లో తారక్ పాల్గొంటారా లేదా? అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.నిజానికి ఎన్టీఆర్ గాయపడినా 'డ్రాగన్' మూవీ షూటింగుకి బ్రేకులు పడలేదు. హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాత చెప్పినదాన్ని బట్టి, సెప్టెంబర్ రెండో వారంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కీలకమైన టాకీ పార్ట్స్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.'డ్రాగన్' సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనికి భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చలపతి ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటుగా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు.